శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (18:28 IST)

ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేం : హైకోర్టులో జగన్ సర్కారు

ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం యు టర్న్ తీసుకుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసినందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. పైగా, ఆయన పదవీకాలాన్ని తగ్గించి, తొలగించారు. దీనిపై ఆయన న్యాయపోరాటం చేసి చివరకు మళ్లీ ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇపుడు జగన్ సర్కారు ఆయన మార్గంలోనే నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థలను నిర్వహించలేమని ఏపీ హైకోర్టుకు తెలిపింది. 
 
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుతం తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని, తాము నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టుకు విన్నవించుకుంది.
 
అయితే, ఎన్నికల నిర్వహణ అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని విషయం కాబట్టి, నిర్వహించగలరో లేదో చెప్పాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని ఈసీకి చెప్పండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
అంతేకాదు, కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కదా అని కూడా న్యాయస్థానం ప్రస్తావన తీసుకువచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఎస్ఈసీ వివరణ ఇవ్వాలంటూ ఆ మేరకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.