బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:12 IST)

ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా అశ్వనీదత్ - కృష్ణంరాజు హైకోర్టులో కేసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.అశ్వనీదత్, ప్రముఖ సీనియర్ హీరో కృష్ణంరాజులు హైకోర్టులో కేసు వేశారు. గన్నవరం విమానాశ్రయం కోసం తమ భూములు అప్పగిస్తే, ఇంతవరకు పరిహారం చెల్లించలేదనీ, ఆ పరిహారాన్ని చెల్లించేలా ఆదేశించాలని వారు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో కోరారు. 
 
నిర్మాత సి అశ్వనీదత్ వేసిన పిటిషన్‌లో గతంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం.. సుమారు 40 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూసమీకరణ కింద ఈ భూమిని బదలాయించాం. దీనికి బదులుగా ప్రభుత్వం సీఆర్డీయే పరిధిలో భూకేటాయింపు జరిపింది. 
 
అయితే, ఇపుడు సీఆర్డీయే పరిధి నుంచి రాజధానిని ప్రభుత్వం తప్పించడంతో.. ఆ భూమికి విలువ పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ హైకోర్టును అశ్వనీదత్ ఆశ్రయించారు. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణను వెంటనే ఆపేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తానిచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని.. లేకుంటే భూసేకరణ కింద.. నాలుగు రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. నాలుగు రెట్ల నష్టపరిహారం కింద అశ్వినీదత్‌.. 210 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరారు.
 
అలాగే, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.