ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!
తన సొంత నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బారకు అన్ని వర్గాలకు చెందిన ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఏపీలో టీడీపీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. ఆ తర్వాత నారా లోకేశ్ ఏపీ రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా నియమితులయ్యారు.
అలాగే, తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి విన్నవించారు.
గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కళాశాల నుంచి ఇప్పించాలని జగదీశ్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్యసాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. ఆయా సమస్యలను విన్న లోకేశ్.. పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.