శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (18:15 IST)

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఓ ప్రకటనలో తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 
 
ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్‌ వెల్లడించారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని తెలిపారు. అటవీ సంపదను కాపాడి, పచ్చదనాన్ని పెంచుతామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. 
 
నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌కు ప్రజా ప్రయోజన శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల పవన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పుతామని వివరించారు. సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఆ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తానని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.