శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 జూన్ 2024 (14:20 IST)

యద్భావం తద్భవతి, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది: డిప్యూటీ సీఎం పవన్ (video)

pawan kalyan
యద్భావం తద్భవతి... మన మనసులో మంచిభావం ఉన్నప్పుడు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఎదురయ్యారనుకోండి, వారితో ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడుతాం. అలాకాకుండా ఎదుటి వ్యక్తిపై ద్వేషభావం ఉన్నప్పుడు వాళ్లకు దూరంగా వెళ్లిపోవడం గానీ దూషించడం గానీ చేస్తాం. మన భావాన్ని బట్టి అక్కడ ఉన్న స్థితి మారిపోతుంది. అందుచేత ఎప్పుడు కూడా సద్భావనతో ఉండాలి. ఎవరు ఏ భావంతో ఉంటే ఆ భావంతోనే ఎదుటివారు కనిపిస్తారు.
 
ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ‘‘మంచివాళ్లెవరైనా ఉంటే వెంటనే తీసుకు వచ్చి నా ముందుంచు, నీకు నేను అమూల్యమైన వరాలనిస్తాను’’ అన్నాడట. దుర్యోధనుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికి వెతికి ఒక్కరు కూడా మంచివాళ్లు కనిపించక నిరాశతో వెనుదిరిగి కృష్ణుని వద్దకొచ్చి ‘‘రోజంతా వెతికినా ఒక్కరంటే ఒక్కరు కూడా మంచివాళ్లు కనిపించలేదు’’ అంటూ పెదవి విరుస్తాడు.
 
కృష్ణుడు ధర్మరాజును పిలిచి, నీ రాజ్యంలో చెడ్డవాళ్లెవరైనా ఉంటే వారిని వెంటనే నాముందుకు తీసుకునిరా, నీకు వరాలిస్తాను’’ అన్నాడు. ధర్మరాజు సాయంత్రం వరకు వెదికి వెదికి తన రాజ్యంలో ఒక్క చెడ్డవాడు కూడా లేడన్న సంతృప్తితో కృష్ణుని వద్దకెళ్లి, చేతులు కట్టుకుని ‘‘బావా, ఎంత వెదికినా నాకు ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు’’ అన్నాడు.
 
దుర్యోధన ధర్మరాజుల మధ్య ఉన్న వ్యత్యాసం అది. అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనం మంచివారమైతే అందరూ మంచివాళ్లే అవుతారు, చెడ్డవాళ్లయితే అందరూ చెడుగానే కనిపిస్తారన్నమాట అంటూ చాగంటి కోటేశ్వర రావుగారు శ్రీ వేంకటేశ్వర వైభవం గురించి చెబుతూ వివరించారు. యద్భావం తద్భవతి అనే ఈ సూక్తిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను పాటిస్తానంటూ చెప్పారు. ఈ మాటను చిన్నప్పుడు తన తండ్రి తనతో చెప్పేవారనీ, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఫలితాలు కూడా మన వద్దకు అలాంటివే వస్తాయని అనేవారు. అందుకే గొప్పగొప్ప ఆలోచనలు చేయండి విజయాలను పొందండి అంటూ చెప్పారు డిప్యూటీ సీఎం.