శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 8 మార్చి 2018 (19:20 IST)

పోరాటం స్పెల్లింగ్ జగన్‌కు తెలియదు... మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పోరాటం స్పెల్లింగ్ కూడా తెలియదని, అటువంటి ఆయన ప్రత్యేక హోదా కోసం తన వెంట రావాలని టీడీపీకి పిలుపినివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సచివాలయంలోని

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పోరాటం స్పెల్లింగ్ కూడా తెలియదని, అటువంటి ఆయన ప్రత్యేక హోదా కోసం తన వెంట రావాలని టీడీపీకి పిలుపినివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఉన్న తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపెడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ పెద్దలు చెప్పారన్నారు. దేశాన్ని పరిపాలిస్తోంది 14వ ఆర్థిక సంఘమా అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
130 కోట్ల మంది భారతీయులు ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారా... 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌నా అని నిలదీశారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలన్నింటినీ ప్రత్యేక ప్యాకేజీ  పేరుతో ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇవ్వడంతో సీఎం చంద్రబాబునాయుడు సరేనన్నారు. 29 పర్యాయాలు సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఇచ్చిన హామీని బీజేపీ పెద్దలు అమలు చేయలేకపోయారన్నారు. మూడున్నరేళ్ల పాటు మిత్రపక్షంగా ఓపిగ్గా ఉన్నామన్నారు. 2018-19 బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచేయి చూపడంతో పోరాటబాట పట్టామన్నారు. 
 
చివరికి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రెండు మంత్రి పదవులు సైతం వదులుకున్నామన్నారు. కేంద్రానికి తాము మిత్రపక్షమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. తమకు పదవులు కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ సభ్యులు పోరాటం చేయడం ద్వారా దేశ ప్రజల దృష్టికి ఏపీ సమస్యలను తీసుకెళ్లామన్నారు.