గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (18:03 IST)

నవ రత్నాలు కాదు... నవ మోసాలు! 0-30 విద్యుత్ స్లాబ్ ఎక్క‌డా లేదు!!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలోకి రాక ముందు న‌వ‌ర‌త్నాలు ఇస్తాన‌ని చెప్పి, తీరా వ‌చ్చాక న‌వ మోసాలు చేశార‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావ్ విమర్శించారు.
 
 
విద్యుత్ ఛార్జీలు రెట్టింపు చేయడం మొదటి మోసం. ఇసుక రేట్లు 4 రెట్లు పెంచడం రెండవ మోసం. మద్యం రేట్లు 5 రెట్లు పెంచడం మూడవ మోసం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం నాలుగవ మోసం. ఓటిఎస్ వసూళ్లు, పేద వాళ్ల మెడకు ఉరితాళ్లు బిగించడం ఐదవ మోసం. 2.30 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం ఆరవ మోసం. ఉద్యోగులకు పి.ఆర్.సి ఇవ్వకపోవడం ఏడవ మోసం. చెత్తపన్ను, ఆస్తి పన్ను పెంచడం ఎనిమిదవ మోసం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం తొమ్మిదవ మోసం. ఇలా నవరత్నాలు నవ మోసాలయ్యాయ‌ని కిమిడి కళావెంకట్రావ్ పేర్కొన్నారు.
 
 
కరోనాతో కోలుకోలేని దెబ్బతిన్న పేద, మద్య తరగతి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని ఏ.పీ.ఈ.ఆర్.సి కి ప్రతిపాద‌నలు పంపడం ప్రజలను కోలుకోలేని దెబ్బతీయడానికే అన్నారు. జగన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి గా ఉంద‌ని, ట్రూ-అప్ ఛార్జీలపై హైకోర్టు ప్రమేయంతో వెనక్కి తగ్గినట్లు తగ్గి, ఇప్పుడు దొడ్డిదారిన స్లాబులు మార్చి ఛార్జీలు పెంచాలను కోవడం జగన్ రివర్స్ విధానానికి ఉదాహరణ అని చెప్పారు. 

 
0-30 స్లాబు విధానం ఏ రాష్ట్రంలో లేదు. స్లాబ్ లలో యూనిట్లను తగ్గించి రేట్లు పెంచడం వల్ల నష్టపోయేది పేద, మద్య తరగతి వర్గాల వారే అన్నారు. పేదవారు కేవలం 30 యూనిట్లకు పరిమితం అయ్యి విద్యుత్ వాడుకోవాలని చెప్పడం జగన్ రెడ్డి మోసకారి విధానానికి నిదర్శనమ‌న్నారు. ఎంతటి పేద కుటుంబమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో కుటుంబం నెలకు 150 -200 యూనిట్లు వాడకం ఉంటోంద‌ని, ఎటువంటి సబ్సిడి లేని పేద, మధ్య తరగతి వర్గాల నుంచి 30 యూనిట్ల పైన వాడితే వారి నుంచి రూ.2.80, వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. 

 
ప్రమాణ స్వీకారోత్సవ సభలో విద్యుత్ ఛార్జీలన్నింటిని తగ్గించేస్తానని చెప్పి, ఇప్పటికి ఆరుసార్లు పెంచి రూ.11,611 కోట్ల భారం ప్రజలపై మోపారు. దక్షిణాది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని అధిక ఛార్జీలు ఏపీ లో వసూలు చేస్తున్నారు. రూ. 26,261 కోట్లు అప్పులు తెచ్చి ఫవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను అప్పుల ఊబిలో ముంచారు. 2014 జూన్ నాటికి అంటే చంద్రన్న సి.ఎం అయ్యే నాటికి ఏపీలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 9,529 మెగావాట్లు. 22.5 మిలియన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉండేది. పట్టణాల్లో 8 గంటలు, గ్రామల్లో 12 గంటలు కరెంట్ కోత ఉండేది. అయినా ఏనాడు ఛార్జీలు పెంచలేదు. పైగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసారు. జగన్ రెడ్డి 30 నెలల పాలనలో పెంచింది కేవలం 1000 మెగావాట్లు మాత్రమే అని క‌ళావెంక‌ట్రావ్ వివ‌రించారు.
 
 
ఇప్పటికైనా దొడ్డిదారిన ఛార్జీలు పెంచడం మాని విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేలా తగిన చర్యలు తీసుకోవాల‌ని,  ఇప్పుడు అమలు చేస్తున్న 50 యూనిట్ల స్లాబ్ విధానాన్ని యదావిధిగా కొనసాగించి పేదవారిపై భారం లేకుండా చూడాల‌ని డిమాండు చేశారు.