1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:43 IST)

పేదరికాన్ని త‌గ్గించ‌డానికి గ్రామ స్థాయిలో ప్రణాళికలు

పేదరిక నిర్ములనపై గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని విజ‌య‌వాడ జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ' విలేజ్ పోవెర్టీ రిడక్షన్ ప్లాన్ '  (వి. పి .ఆర్. పి ) అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ, ప్రజల  సామజిక, ఆర్ధిక సమగ్రాభివృద్ధికి  తీసుకోవలసిన చర్యలు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి ఎం.ఆర్.ఎల్.ఎం. యాప్ లో పొందుపరచాలన్నారు.

' విలేజ్ పోవెర్టీ రిడక్షన్ ప్లాన్ ' గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ లో బాగమేనన్నారు. వి.పి.ఆర్.పి రూపకల్పనలో గ్రామ సంఘాలు, సి.ఆర్. పిలకు సంబంధిత శాఖల అధికారులు తమ శాఖకు సంబందించిన సమాచారాన్ని అందించి సహకరించాలన్నారు. జిల్లాలో పేదరిక నిర్ములన గ్రామ స్థాయి నుండే ప్రారంభం కావలసి ఉందని, అందుకు వి. పి .ఆర్. పి. ప్రణాళికలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇందుకు స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని, వారి సేవలు వినియోగించుకోవాలన్నారు.  గ్రామాలలో నివసించే ప్రజల స్థితిగతులు, వారి ఆర్ధిక, సామజిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి దోహదం చేసే అంశాలు, పేదరిక నిర్మలనకు తీసుకోవలసిన చర్యలు, గ్రామంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, గ్రామాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, తదితర వివరాలను గ్రామ సంఘాల యాప్ లో గ్రామ సంఘాల సిబ్బంది నమోదు చేస్తారన్నారు. ' విలేజ్ పోవెర్టీ రిడక్షన్ ప్లాన్ ' లో తెలియజేసిన అంశాలననుసరించి ఆ గ్రామంలోని ప్రజల ఆర్ధిక, సామజిక అభివృద్ధికి, గ్రామం సర్వతోముఖాభివృద్దికి పలు చర్యలు  తీసుకోవడం జరుగుతుందన్నారు. 
 
సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు, డి. పి .ఎం. సునీత లక్ష్మి, వ్యవసాయ అనుబంధ శాఖలు, విద్య శాఖ, ఆర్.డబ్ల్యూ,ఎస్., పంచాయతీరాజ్, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.