శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:09 IST)

కోతి పగబట్టిందా..? అడవిలో వదిలేసినా తిరిగి గ్రామానికి వచ్చేసింది..!

Monkey
కోతి పగబట్టిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ వ్యక్తి మీద పగబట్టిన కోతి ఏకంగా 22 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి మరీ కొరికింది. ఆ కోతి చెవికి ఉన్న గుర్తును చూసి ఆ కోతే పగబట్టి మరీ సదరు వ్యక్తిని కొరికిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగలూర్‌ జిల్లాలోని కొట్టిఘెహరా అనే గ్రామంలో ఐదు సంవత్సరాల వయసున్న ఓ మగకోతి గ్రామస్థులను ఎన్నో ఇబ్బందులు పెట్టేది. 
 
స్కూలు పిల్లలపై కూడా దాడులకు పాల్పడింది. దీంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్‌ 16న గ్రామానికి వచ్చిన అధికారులకు అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ జగదీశ్‌ సాయం చేశాడు. చాలా కష్టం మీద ఆ కోతిని అధికారులు పట్టుకున్నారు.
 
తనను పట్టించిన జగదీశ్‌పై కోపం పెంచుకున్న ఆ వానరం వెంటనే అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్‌ వెంట పడింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. ఆటో టాప్‌, సీట్లను చించి జగదీశ్‌పై దాడి చేసింది. చెవులను కొరికి తన కోపాన్ని తీర్చుకుంది. 
 
వెంటనే అధికారులు ఆ వానరాన్ని పట్టుకొని ఊరికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో విడిచిపెట్టారు. అయితే కోతి ఓ లారీ మీద ఎక్కి మళ్లీ గ్రామానికి చేరుకుంది. జగదీశ్‌ కోసం ఊరంతా తిరిగింది. కోతి చెవిమీద ఉన్న గుర్తును గమనించి గ్రామస్థులు ఆ వానరం ముందుదేనని గుర్తించారు. ఊళ్లోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్‌కు చెప్పడంతో అతడిలో మళ్లీ టెన్షన్ మొదలైంది.