శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (11:59 IST)

సీఎం జగన్‌కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గుడి కట్టించారు.. నవరత్నాల నిలయం పేరుతో..?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి గుడి కట్టించారు. నవరత్నాల నిలయం పేరుతో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయంలో ముఖ్యమంత్రి జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు. 
 
భారీ ఎత్తున నిర్మించిన ఈ ఆలయంలో దేవుడి ఆలయాలలోనే ఉండేటువంటి ఓ హుండీ ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు. ఇక ప్రసాదంగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ఈ జగనన్న నవరత్నాల నిలయాన్ని ప్రారంభించారు.
 
ఇదిలావుంటే.. సీఎం జగన్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పిల్లలకు అందించడం కోసం 'మనబడి నాడు-నేడు' ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. 
 
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు-నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు.