బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (07:52 IST)

అందుబాటులో మాస్కులు.. కరోనాపై జగన్‌ అప్రమత్తం

కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలంగాణలో కోవిడ్‌-19 కేసు నమోదయ్యిందని ఆయన గుర్తు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో వైరస్‌ బాగా విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదని, ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కానీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 
ముందస్తుగా సన్నద్ధం కావాలి..
‘సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యం. వైద్యాధికారులను కలుపుకుని శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ ముఖ్యం. ప్రజలను చైతన్యం చేయాలి. కరోనా వైరస్‌ ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి? అన్నదానిపై ప్రచారం చేయాలి.

ప్రతి గ్రామ సచివాలయంలో కరపత్రాలను అతికించాలి. బాడీ మాస్క్‌లు, మౌత్‌ మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలి. ఆర్డర్లు ఇప్పటినుంచే ఇస్తే మంచిది. అప్పటికప్పుడు ఆందోళన చెందే కన్నా.. ముందస్తుగా సన్నద్ధం కావాలి’అని సీఎం పేర్కొన్నారు.
 
కరోనా వైరస్‌పై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు వివరాలు అందించారు. కేవలం 5 శాతం కేసుల్లో మాత్రమే కరోనా వల్ల ప్రమాదకర పరిస్థితులున్నాయని ఆయన తెలిపారు.వయోవృద్ధులు ఎక్కువగా విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

సార్స్‌ను మనం వియవంతంగా ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా డాక్టర్‌ జవహర్‌రెడ్డి గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు, ఐసోలేషన్‌ ప్రక్రియ ముఖ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

కరోనాను డీల్‌ చేయడానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన దేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
కరోనాపై అప్రమత్తం: ఆళ్ల నాని
కరోనాపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా గుర్తించిన దేశాల నుంచి వచ్చేవారిని తనిఖీ చేస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, పోర్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇప్పటికే విశాఖ, తిరుపతిలో ఐసోలేషన్‌ వార్డులు, గదులను ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, ఇతరచోట్లా ఐసోలేషన్‌ వార్డులు, రూములు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు కేంద్రం ఆదేశాలు పాటిస్తూ చర్యలు చేపట్టామన్నారు. కరోనాపై ఈ నెల 6న కేంద్రం నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొంటామన్నారు.