మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:21 IST)

జగన్​ తో ముఖేశ్​ అంబానీ.. ఈ భేటీ వెనకున్న రహస్యమేంటో తెలుసా?

ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ని ఆయన కలిశారు.

ముఖేశ్ అంబానీ వెంట కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.
 
ముఖేశ్ అంబానీ పర్యటనను శనివారం మధ్యాహ్నం వరకు కూడా చాలా రహస్యంగా ఉంచారు. ముఖేశ్ అంబానీ విజయవాడ వస్తున్న విషయం ఎవరికీ తెలియనివ్వలేదు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి వెళ్లారు. ఈ న్యూస్‌కు సంబంధించి వివరాలను వైసీపీకి చెందిన మీడియాకు తప్ప మరే ఇతర మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు.

అయితే ముఖేశ్ అంబానీని తాడేపల్లిగూడేనికి తీసుకురావడం, ఆయనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరపడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించడం జరిగింది.

పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ముఖేశ్‌కు జగన్ వివరించారు. మూడు రాజధానుల విషయంపై కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. 
 
తిరుపతిలో రిలయెన్స్ ఏర్పాటు చేసే స్థలం వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుదని కూడా విసృతంగా ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే ముఖేశ్ అంబానీతో మాట్లాడాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.

ఇందుకోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ముఖేశ్ అంబానీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో చర్చించారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. ఇంతకీ ఈ స్థలం వ్యవహారం తేలిందో లేదో మరి!