మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (08:37 IST)

2021 జూన్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి: జగన్‌

2021కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వర్షాకాలంలో నది ప్రవహించే సమయంలో కూడా అంటే జూన్‌ నుంచి అక్టోబరు వరకూ కూడా పనుల జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులకు స్పష్టంచేశారు.

ఈమేరకు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాలన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి స్పిల్‌వే సంబంధిత పనులు పూర్తిచేయాలని, ఆతర్వాత కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తిచేయాలని, నదీ ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లించి ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంను పూర్తిచేయాలని, ఇప్పటినుంచే సహాయ పునరావాస కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
 
పోలవరం ప్రాజెక్టులో పనుల ప్రగతిని సీఎం వైయస్‌జగన్‌ స్వయంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న వైయస్‌.జగన్‌ నేరుగా స్పిల్‌వే పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. స్పిల్‌వే నిర్మాణ పనులపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు.

అక్కడే ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పనులు ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పనిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సీఎం అక్కడనుంచి నేరుగా కాపర్‌ డ్యాంకు వద్దకు వెళ్లి పరిశీలించారు. కాపర్‌డ్యాంలో మిగిలిపోయిన పనులు, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌డ్యాంకు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించి.. ఇంజినీర్లతో మాట్లాడారు.

తర్వాత నేరుగా ప్రాజెక్టు వద్దఉన్న కాన్ఫరెన్స్‌ హాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.

ప్రాజెక్టు పనుల పురోగతి, భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలపై సమగ్రంగా సమీక్షించారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, కాపర్‌ డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం, కుడి, ఎడమ కాల్వల అనుసంధానం, సహాయ పునరావాస పనులు.. ఇలా ఒక్కో అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
2021 జూన్‌ నాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తికావాలి: సీఎం
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... జూన్‌ 2021 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తికవాలని స్పష్టంచేశారు. ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. 2021 సీజన్‌కు అందుబాటులోకి తీసుకు వస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 
 
గతంలో ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రణాళికలోపమే కాక, సమన్వయ లోపం, సమాచారం లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపించిందని దీని ఫలితంగా గత సీజన్‌ను కోల్పోయామన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని, వర్షాకాలం అంటే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు.. ఈ 5 నెలల్లో కూడా పనులు జరిగేలా కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

ఈ పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై మొదట దృష్టిపెట్టాలన్నారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే లక్ష్యంలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సీఎం స్పష్టంచచేశారు. ఈ ఏడాది జూన్‌లో ముందుగా స్పిల్‌వే పనులుపూర్తిచేయాలన్నారు. అదేవేగంతో అప్రోచ్‌ ఛానల్‌కూడా పూర్తికావాలని ఆదేశించారు.

స్పిల్‌వేను జూన్‌నాటికి అందుబాటులోకి తీసుకు వస్తే... గోదావరి నది ప్రవాహాన్ని స్పిల్‌వేమీదుగా మళ్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం పనులు జరుగుతాయని, ఆమేరకు కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను కూడా భర్తీచేయాల్సి ఉంటుందన్నారు. 
 
కాపర్‌ డ్యాం పూర్తిచేసి, స్పిల్‌వే మీదుగా ప్రవాహంమళ్లించే పరిస్థితి ఉన్ననాటికి ముంపు పెరుగుతుందని, ముంపు ప్రాంతాలను తరలించడంపై ఆలస్యం చేయకుండా ఇప్పటినుంచే దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. 
సహాయపునరావాస పనులు ఆరోజు నుంచి ప్రారంభిస్తే ఉపయోగం ఉండదని, ఇప్పటినుంచే ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. 
 
స్పిల్‌వే ఛానల్‌లో మొన్నటి వరద కారణంగా... బాగా సిల్ట్‌ పేరుకుపోయిందని, దీనివల్ల ఎక్కడ కాంక్రీట్‌చేశారు, ఎక్కడ చేయలేదన్నది గుర్తించడం చాలా కష్టంగా ఉంటుందని, తర్వాత కాలంలో ఈ సిల్ట్‌ మరింతంగా పెరుగుతుందని, దీనికోసం సరైన పరిశోధన చేసి.. ఎక్కడ కాంక్రీట్‌ చేశారు, ఎక్కడ చేయలేదన్నదీ ఇప్పుడే గుర్తించాలని సీఎం స్పష్టంచేశారు.

పనులు వేగంగా జరగడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. కుడి, ఎడమ కాల్వలను  అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రెండువైపులా టన్నెల్‌ తవ్వకం పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

జూన్‌కల్లా రైట్‌మెయిన్‌కెనాల్‌ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. రైట్‌ మెయిన్‌కెనాల్‌ టన్నెల్‌లో లైనింగ్‌ కూడా పూర్తవుతుందని వెల్లడించారు. జూన్‌కల్లా తప్పకుండా నీరు పోయేలా ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.

ఎడమకాల్వ కనెక్టివిటీకి సంబంధించికూడా పనులు చురుగ్గా సాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఈ పనులు కూడా వేగవంతంగా అయ్యేలా చూడాలని సీఎం చెప్పారు. ఎడమ కాల్వలోకి నీరు వచ్చిన తర్వాత గండ్లు పడే పరిస్థితులు ఉండకూడదని అధికారులకు స్పష్టంచేశారు. 
 
ఈ పనులు ప్రణాళికా బద్ధంగా, అనుకున్న సమయంలోగా పూర్తికావాలంటే పనుల డిజైన్లు అనుమతుల్లో ఆలస్యం కాకుండా ఉండాలని, దీనిపై ప్రత్యేకమైన దృష్టి ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. డ్రాయింగులు, డిజైన్ల అనుమతుల కోసం, లైజనింగ్‌కోసం ఒక అధికారిని ఢిల్లీలో పెట్టాలన్నారు. 
 
ప్రాజెక్టు పనులు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలంటే సమస్యలు, అడ్డంకులు ఏంటి? అన్నవాటిని గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జూన్‌ నుంచి అక్టోబరు వరకూ పనులు ఆగిపోకుండా ఉండాలంటే.. ఏయే పనులు కావాలి, వాటికి సంబంధించిన ఏం అనుమతులు కావాలి, ప్రాధాన్యతా క్రమంలో ఏం చేయాలన్నదానిపై ఒక జాబితా రూపొందించుకుని ఫోకస్‌గా ముందుకు పోవాలని సీఎం చెప్పారు. 
 
స్పిల్‌వే ముందరి భాగంలో నిర్మించాల్సిన బ్రిడ్జిపైనా సమీక్షా సమావేశంలో చర్చజరిగింది. ఈ బ్రిడ్జిని ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంతో అనుసంధానించేలా డిజైన్‌ను ప్రతిపాదించారు. తద్వారా నాలుగు వరుసల రహదారి ఏర్పడుతుందని సీఎంకు వెల్లడించారు. డిజైన్‌ ఖరారుచేసి ఆ మేరకు పనుల విషయంలో ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు చెప్పారు. వైయస్సార్‌ గేట్‌ వేగా బ్రిడ్జికి పేరుపెట్టాలంటూ సమావేశంలో ప్రతిపాదించారు. 
 
ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథం చూపండి
పోలవరం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం నిశితంగా సమీక్షించారు. కాపర్‌డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తిచేస్తే గోదావరిలో  41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు. దీనివల్ల వెంటనే 17వేలకుపైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందన్నారు.

ఆమేరకు సహాయ పునరావాసాల పనులపై ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధంచేసుకోవాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల కోసం ఒక ప్రత్యేక అధికారిని పెట్టామని, ఫిర్యాదు రాకూడదని, ముంపు బాధితులపట్ల  మానవతా దృక్పథంతో ఉండాలని స్పష్టంచేశారు.

ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని సీఎం చెప్పారు. 35 కాంటూరులో కూడా 6 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, దేవీపట్నం మండలంలో ఈ 6 గ్రామాలను తక్షణం తరలించాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.

భధ్రాచలంలో మూడోవిడత ప్రమాద హెచ్చిరిక వస్తే ఈ గ్రామాలు మునుగేవని, ఇప్పుడు మొదటి ప్రమాదహెచ్చరిక వస్తేనే మునిగిపోతున్నాయన్నారు. ఆమేరకు సహాయపునరావాస పనులకు సిద్ధంకావాలని సీఎం అధికారులకు స్పష్టంచేశారు.

సహాయపునరావాస పనులతోపాటు, పునరావాలస కాలనీల్లో పనులకోసం అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని సీఎం తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ పిల్లి సుభాష్‌ చంద్రబోష్, నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్, ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని, రవాణా, ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి పేర్ని నాని,  స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటివనిత, రాజమండ్రి ఎంపీ మార్గానిభరత్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, బాలరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.