శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:48 IST)

ఏక‌గ్రీవానికి అంగీక‌రిస్తే స‌రే.. లేదంటే బ‌ద్వేలులో స‌మ‌ర‌మే!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికను తాము సీరియస్‌గా తీసుకుంటామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ ఉప ఎన్నికను ఓ గీటురాయిగా భావిస్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఫలితాలను తెలుసుకుంటామని అన్నారు.
 
స‌జ్జ‌ల సచివాలయంలోని మీడియా పాయింట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 తరువాత తాము ఎదుర్కొన్న ప్రతి ఎన్నికలోనూ పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ప్రజల్లో అభిమానం పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదని అన్నారు. ఈ రెండేళ్లలో జగన్ సర్కార్ ఏం చేసిందో ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని చెప్పారు. 2019 నాటి కంటే ఎక్కువ మెజారిటీని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
ప్రజల అభిమానం, ఆదరణ తమ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజలను గౌరవించి..వారి వద్దకు వెళ్లి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొని ఓట్లు అడుగుతారని, తాము అదే విధానాన్ని అనుసరిస్తామని అన్నారు. రెండు సంవత్సరాలుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విప్లవాత్మక సంస్కరణలను ప్రజలకు వివరించి, ఓట్లు అడుగుతామని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు.
 
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఎన్నికలను తాము కోరుకోవట్లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు డబ్బులు పంచకుండా చూస్తామని అన్నారు. అలాగే తాము డబ్బులు పంచాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. 
 
సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ కన్నుమూస్తే, వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చి, పోటీ అనేది లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఆనవాయితీని టీడీపీ గౌరవించి, పోటీ పెట్టకపోతే, తాము స్వాగతిస్తామని చెప్పారు. అభ్యర్థిని దింపితే. తాము కూడా ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని అన్నారు. మండలాల వారీగా మంత్రులను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
 
సినీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ పాలసీని తీసుకుని వస్తున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన స్వార్థం కోసం ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని, ఆ బురద ఆయనపైనే పడుతుందని గమనించలేకపోయాడని చెప్పారు. ఆన్‌లైన్ టికెట్ల విధానాన్ని విమర్శించడం ద్వారా పవన్ కల్యాణ్ తన బురదను తానే చల్లుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు కూడా పవన్ కల్యాణ్‌ను పట్టించుకోవట్లేదని అన్నారు.
 
పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ ప్రముఖులు కూడా సమర్థించట్లేదని సజ్జల చెప్పారు. ఆయన వెంట ఉండటం వల్ల పరిశ్రమకు ఉపయోగం లేదని వారు భావించి ఉండొచ్చని అన్నారు. ఆన్‌లైన్‌ టికెట్ల అంశంపై నిర్మాత, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆన్‌లైన్ విధానం వల్ల- కష్టపడి సినిమా తీసిన నిర్మాతకు డబ్బులు అందుతాయని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏ మాత్రం నష్టపోరని అన్నారు. తక్కువ ఖర్చుతో ఓ సామాన్య ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
 
ఆన్‌లైన్ టికెటింగ్ విషయాన్ని పవన్ కల్యాణ్ వంటి ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నారే తప్ప మిగిలిన వారందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. పెట్టిన పెట్టుబడి అంతా వారం రోజుల్లోనే రాబట్టు కోవాలనే ఉద్దేశంతో వంద రూపాయల టికెట్‌ను రెండువేల రూపాయలకు అమ్ముకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని చెప్పారు. ఆ పరిస్థితి లేకుండా చేయడానికే ఆన్‌లైన్ వ్యవస్థను తెచ్చామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు దీన్ని అనుసరించేలా తీర్చిదిద్దుతామని సజ్జల పేర్కొన్నారు.