టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..
కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇపుడు యూ టర్న్ తీసుకున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనపై బలవంతంగా సంతకం చేయించి, కేసు నమోదు చేశారంటూ వాగ్మూలంతో కూడిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించాడు. పైగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ప్రాధేయపడ్డాడు. దీంతో ఈ కేసుపై మంగళవారం మరోమారు విచారణ జరుగనుంది.
టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా సత్యవర్థన్ అన్ వ్యక్తి పనిచేసేవాడు. టీడీపీ కార్యాలయంలో వైకాపా నేతలు దాడి చేసిన సమయంలో సత్యవర్థన్ ఆఫీసులోనే ఉన్నట్టు సమాచారం. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 45 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ సూచన చేసింది. దీంతో వారంతా మళ్లీ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యవర్థన్ స్పష్టం చేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను టీడీపీ కార్యాలయంలో లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరిస్తూ తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి తీసుకొచ్చిన సీడీతోపాటు అఫిడవిట్ అందజేశారు. ఈ కేసులో పోలీసులు తనను సాక్షిగా పిలిచి సంతకం తీసుకున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విచారణను కోర్టు మంగళవారానికి వాయిదావేసింది.