శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 31 ఆగస్టు 2016 (21:46 IST)

చంద్ర‌బాబుపై ఎఫ్ఐఆర్ తప్పదా... మ‌రి సీఎం ప‌ద‌వి?

హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. 'ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన

హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. 'ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడింది. ఈ నివేదికతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించడం తెలిసిందే. 
 
ఆ మేరకు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నదని సమాచారం. గతేడాది దాఖలు చేసిన చార్జిషీట్‌లోనూ 33 సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏవిధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి.. నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29 లోపు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము న్యాయస్థానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెప్పారు.
 
ఎఫ్‌ఐఆర్ తప్పకపోవచ్చు: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే నూటికి నూరు శాతం చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి తెలిపారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 
 
సీఆర్పీసీ ప్రకారం 60 ఏళ్ళు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థ వద్దకు పిలువడం కుదరదని చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం కూడా ఉంటుందని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి స్పష్టం చేశారు.