చంద్రబాబు అరెస్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691...
స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఆదివారం అర్థరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, అక్కడ ఆయనకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు.
ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోనే ఆయనను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఓ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు. మార్గమధ్యంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ కాగా దాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకూ చంద్రబాబు ప్రయాణించే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆదివారం అర్థరాత్రి చంద్రబాబు కాన్వాయ్ జైలుకు చేరుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు. జైల్లో అధికారులు చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటూ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినందున ఖైదీ దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించారు. అప్పటివరకూ చంద్రబాబు వెంట వచ్చిన ఆయన తనయుడు లోకేశ్ అధికారుల అనుమతితో జైల్లో కాసేపు చంద్రబాబుతో మాట్లాడి వచ్చేశారు.
చంద్రబాబు అరెస్టు : ఏపీలో కొనసాగుతున్న బంద్
ఏపీ నైపుణ్యాద్ధి సంస్థలో అవినీతి చోటుచేసుకుందని పేర్కొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీనికి నిరసంగా ఆ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బంద్ కొనసాగుతుంది. కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఆందోళ చేస్తున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఒంగోలు బస్టాండ్, గిద్దలూరు బస్టాండ్ల వద్ద ఆందోళన కొనసాగుతోంది. బస్సులు అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయనగరంలో బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
తిరుపతిలోని అంబేద్కర్ కూడలి వద్ద టీడీపీ నేతల నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్ డిపో ఎదుట టీడీపీ నాయకులు ఆందోళన దిగారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోకు, నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.