శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (16:21 IST)

'అన్నవరం'లో అన్యమత ప్రచారం: ముగ్గురు ఉద్యోగులకు మెమో

అన్నవరం కొండపై అన్యమత ప్రచార పోస్టర్‌ అంటించి ఉన్న ఆటో కనిపించడం చర్చనీయాంశమైంది. దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం సమీపంలో పోస్టర్‌ అంటించి ఉన్న ఆటో తిరుగుతున్న ఫొటోలు సోమవారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో అధికారులు హుటాహుటిన దీనిపై పరిశీలించారు. 
 
ఈవో త్రినాథరావు ఆరా తీయగా విషయం తెలిసిన వెంటనే ఆటోను కొండ కిందకు పంపించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అన్యమత ప్రచార పోస్టరు అంటించి ఉన్న ఆటో కొండపైకి వస్తుంటే టోల్‌గేటు సిబ్బంది ఏం చేస్తున్నారని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని భద్రతా విభాగ ఇన్‌ఛార్జి వర్మ, ట్రాన్స్‌పోర్ట్‌ సిబ్బంది సత్యనారాయణ, ప్రసాదనాయుడులకు మెమో ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 
 
ఇటీవలే... అయినా మళ్ళీ..: 
రత్నగిరిపై ఓ భజన బృందం భక్తి గీతాలు ఆలపిస్తున్న సమయంలో అన్యమతం గురించి ప్రస్తావిస్తూ భజన చేశారని ఆరోపణలు రావడం మరువకముందే మరో సంఘటన జరగడం చర్చకు దారితీసింది.
 
ఆదేశాలు జారీ: 
కొండపైకి వాహనాలు వచ్చే సమయంలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పంపాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ ఆదేశాలు ఇచ్చారు. వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి అన్యమత ప్రచార స్టిక్కర్లు, సామగ్రి కొండపైకి రాకుండా నివారించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయమై టోల్‌గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని పీఆర్వో విభాగానికి ఆదేశాలిచ్చారు.