గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (20:35 IST)

విఓఏలను తొలగిస్తే ఉద్యమిస్తాం: చంద్రబాబు

విఓఏలను తొలగిస్తే ఉద్యమిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో

"విఓఏలు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని డ్వాక్రా సంఘాలకు స్వయంగా ఏర్పాటు చేసుకున్న  గ్రామ/పట్టణ సంఘాల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది? సమావేశాల నిర్వహణ, సమన్వయం చేసుకునేందుకు సహాయకులుగా వీరిని గ్రామ సంఘాలు నియమించుకుంటే ప్రభుత్వం తొలగించటం చట్ట విరుద్ధం.

పరస్పర సహాయక సహకార చట్టం 1995(మ్యాక్స్‌) చట్టం కింద రిజిష్ట్రర్‌ కాబడిన గ్రామ/పట్టణ సంఘాల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం అంటే ఎన్టీఆర్‌ తెచ్చిన చట్ట స్ఫూర్తికి తూట్లు పొడవటమే అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలకు విఓఏలు చేస్తున్న మెరుగైన సేవలను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ సంఘాల ద్వారా వీరికి రూ.3 వేలు పారితోషికాన్ని అదనంగా ఇచ్చి సంఘాలు ఇచ్చే జీతంతో కలిపి రూ.5 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవటం జరిగింది.

విఓఏల వేతనాన్ని రూ.10 వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరిగి చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉద్యోగాల నుంచే తొలగించేందుకు జగన్మోహన్‌రెడ్డి కుట్ర చేయటం అమానుషం. 6నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది.

పేదరికంలో ఉంటూ సాటి మహిళలకు సాయం చేసే విఓఏలపై కక్షసాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు. ప్రభుత్వ వైఖరికి తట్టుకోలేక, వైసీపీ నాయకుల వేధింపులను ఎదుర్కొనలేక విఓఏలు ఆత్మహత్యలకు కూడా పాల్పడటం అమానుషం, విషాదకరం.

నెలకు రూ.10 వేలు చొప్పున వేతనాన్ని ఇచ్చి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, 6 నెలలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను నెలకు రూ.10 వేలు చొప్పున వెంటనే చెల్లించాలని మరియు వారిపై వేధింపులను ఆపి ఉద్యోగ భద్రతను కల్పిస్తూ సంఘాల వ్యవహారాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

విఓఏలను తొలగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించ‌డంతో పాటు న్యాయపరమైన పోరాటానికి దిగుతాం" అని హెచ్చరించారు.