ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (07:50 IST)

14న చంద్రబాబు ఇసుక దీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ఒకరోజు దీక్ష చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నెల 14న విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలైనా.. ఇసుకను అందుబాటులోకి తేలేదని విమర్శించారు.

భవన కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు తప్పుపట్టారు. గతంలో మాదిరి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాలులో టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ప్రసంగిస్తూ ఆయనీ ప్రకటన చేశారు.

ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మూడు డిమాండ్లతో ఈ దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘ఇసుకను ఖరీదుకు కాకుండా ఉచితంగా ఇవ్వాలి. ఇసుక కొరతతో పనులు లేక చనిపోయిన వారి కుటుంబాల కు రూ.25 లక్షల పరిహారమివ్వాలి.

ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల వంతున పరిహారమివ్వాలి. ఇది ప్రభుత్వం సృష్టించిన సమస్య. తమ చేతగానితనానికి ప్రజలను బలి చేస్తున్నారు. వరదలు, వర్షాల వల్ల ఇసుక కొరత వచ్చిందని సాకులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ వర్షాలు, వరదలు ఉన్నాయి. అక్కడెందుకు ఈ సమస్య రాలేదు?

ఇక్కడి ఇసుక హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై తరలిపోతోంది. వైసీపీ నేతలు తమ దోపిడీకి దీనిని మార్గంగా ఎంచుకున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం ఒక్క సమీక్షా చేయరు. దిక్కుమాలిన సంజాయిషీలతో మంత్రులు రోజులు దొర్లిస్తున్నారు.

ఇసుకను ఉచితంగా ఎందుకివ్వరు? సమస్య తీవ్రతను ఎత్తిచూపడానికి పవన్‌ కల్యాణ్‌ యాత్ర చేస్తే అందరూ కలిసి ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండర్ల గురించి మాట్లాడుతోందని, కాని ఒక ప్రభుత్వం, ఒక వ్యక్తి మారేసరికి మొత్తం రాష్ట్రమే రివర్స్‌ దారి పట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

''అదానీ గ్రూప్‌ విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా వేర్‌ హౌసింగ్‌ సెంటర్‌ పెడతామని వచ్చారు. దానిని పోగొట్టారు. రిలయన్స్‌ గ్రూప్‌ రూ.15 వేల కోట్లతో తిరుపతిలో పెద్ద ఎలక్ర్టానిక్‌ పార్క్‌ పెడతానని ప్రకటించింది. వీళ్లు రాగానే వాళ్లనూ వెళ్లగొట్టారు. బీఆర్‌ శెట్టి గ్రూప్‌ రూ.12 వేల కోట్లతో అమరావతిలో వైద్య రంగంలో పెట్టుబడులు పెడతానని ప్రకటించారు.

ఆయనా పారిపోయారు. మన కొత్త రాష్ట్రానికి సాయం చేయాలని నేను అడగ్గానే సింగపూర్‌ వారం రోజుల్లో వాళ్ల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని మన రాజధానికి ఉచితంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇచ్చింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న సింగపూర్‌ కన్సార్షియం వెళ్లిపోయింది.

మనకంటే ఎక్కువ రాయితీలిస్తామని మహారాష్ట్ర, తమిళనాడు ముందుకొచ్చినా వారిని కాదని కియా కార్ల ఫ్యాక్టరీ మన రాష్ట్రానికి వచ్చింది. దానికి తోడుగా విడి భాగాల పరిశ్రమలు రావాలి. అవేవీ రాలేదు. హైదరాబాద్‌లో హైటెక్స్‌ మాదిరిగా విశాఖలో పెట్టాలని లులూ గ్రూప్‌ను తెచ్చాం. వాళ్లనూ వెళ్లగొట్టారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు మాత్రం మనం ఎవరికి ఇచ్చామో వారినే ఉంచారు. అందరినీ వెళ్లగొడితే ఆ ఎయిర్‌పోర్టులో ఎవరు ఎక్కుతారు? బంగారు బాతు వంటి అమరావతిని చంపేశారు. వెలిగొండ ప్రాజెక్టులో మేఘా కంపెనీ టన్నెల్‌ పని రద్దు చేయలేదు. దాని పక్కన మరో కంపెనీ టన్నెల్‌ పని రద్దు చేసి మళ్లీ టెండర్‌ పిలిచారు. పోలవరం రివర్స్‌ టెండర్లలో 750 కోట్లు ఆదా అయిందని చెప్పారు.

ఇప్పుడు ఇసుక కోసం ఆ పనిని రూ.500 కోట్లు పెంచుతున్నారట! ఇంకా ఎన్ని వందల కోట్లు పెంచుతారో చూడాలి. రాష్ట్రానికి ఏవీ రాకపోతే ఆదాయం ఎలా వస్తుంది? పథకాలు ఎలా అమలు చేస్తారు? అందరికీ పేదరికం పంచుతారా" అని నిలదీశారు.
 
ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు
12 కేసుల్లో మొదటి, రెండో నిందితులుగా ఉండి ప్రతి వారం కోర్టులో న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తులా తమ గురించి మాట్లాడేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు అవినీతి గురించి తవ్వండి.. సన్మానాలు చేస్తామని ఆఫర్లు ఇచ్చి అనేక కొండలు తవ్వించి చివరకు ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు.

చేసిన తప్పులను ఎత్తిచూపితే ఆబోతుల్లా, ఉగ్రవాదుల్లా మీద పడుతున్నారు. కోర్టులంటే కూడా వీరికి లెక్క లేదు. ఏబీఎన్‌, టీవీ5 చానళ్లను నిలిపివేస్తే కోర్టు జరిమానా విధించింది. తప్పులు రాస్తే కేసులు పెట్టాలని జీవో ఇచ్చారు. జగన్‌ పత్రిక, టీవీ మనపై ఎన్ని రాశాయి?

సొంత బాబాయిని చంపిన వాళ్లను పట్టుకోలేరు గానీ మనపై మాట్లాడుతుంటారు. అంత దమ్మున్న వాళ్లు సమస్యలు రాకుండా చూసుకోవాలి. కష్టంలో ఉన్న వారి గురించి మాట్లాడడం నా బాధ్యత. మీకు భయపడి నోరు మూసుకోలేను. మనం వెనక్కి తగ్గితే రాష్ట్రం వెనకబడిపోతుంది.

ఏ కేసులకూ భయపడాల్సిన అవసరం లేదు. భయపడినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గాలికి కొట్టుకుపోయేవారు ఎక్కడా మిగలరు’ అని తెలిపారు. టీడీపీ సమావేశంలో ఇసుక సత్యాగ్రహం యోచన చర్చకు వచ్చింది.

ఉప్పు సత్యాగ్రహం మాదిరిగా వాగులు, నదుల్లో ఇసుకను తవ్వి ప్రజలకు అందించాలని, ఏ కేసులు పెట్టినా ఎదుర్కోవాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. ఈ నెల 14వ తేదీ దీక్ష తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెలలో ప్రారంభం కానున్న టీడీపీ సంస్థాగత ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. సమర్థులను కమిటీల్లోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.