బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (08:42 IST)

ప్రశ్నపత్రం లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

tdp leader narayana
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు బెయిల్ మంజూరైంది. నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 
 
నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి గత 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. 
 
కాగా, టెన్త్ ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను మంగళవారం హైదరాబాద్ నగరంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయన్ను ఆయన కారులోనే చిత్తూరు తరలించారు. ఆ తర్వాత ఆయనకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు.
 
బెయిల్ లభించిన తర్వాత నారాయణ మాట్లాడుతూ, పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారు. దానితి తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారని తెలిపారు.