శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (21:03 IST)

మాజీ మంత్రి నారాయణ తప్పు చేశారు.. నేరం రుజువైతే పదేళ్ళ జైలు

narayana
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతి పి.నారాయణ తప్పు చేశారని, ఈ కేసులో ఆయనపై మోపిన నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

 
ఈ అరెస్టుపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన జరిగిన తెలుగు పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాన్ని ముందుగానే లీక్ చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు ఆ తర్వాత కాసేపట్లోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేసి పరీక్షా కేంద్రానికి పంపే యత్నం చేశారని ఎస్పీ తెలిపారు. 

 
అయితే, ఈ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో పని చేసే విద్యార్థులకు మంచి మార్కులు రావాలన్న ఏకైక ఉద్దేశ్యంతో నారాయణ విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది ఈ తరహా చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీపై గత నెల 27వ తేదీన చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని నమోదు చేశారమని ఎస్పీ వివరించారు. వీరిలో నారాయణతో పాటు చిత్తూరు డీన్ బాలగంగాధర్ ఉన్నారని చెప్పారు. 

 
ఈ కేసులో పక్కా ఆధారాలతోనే నారాయణను అరెస్టు చేశారమన్నారు. ఆర్గనైజ్డ్ మెకానిజం (వ్యవస్థీకృత యంత్రాంగం) ద్వారా నారాయణ విద్యా సంస్థలు మాల్ ప్రాక్టీస్‌కు గతంలో పాల్పడ్డారని అయితే, ఈ దఫా తమ నిఘాతో వారి ఆటలు సాగలేదని చెప్పారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇతర విద్యా సంస్థల్లో పనిచేసిన వారుగానే తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నారాయణ తప్పు చేశారని తేలితే పదేళ్ళ వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.