రామతీర్ధం విగ్రహం ధ్వంసం చేసిన నిందితుల్ని పట్టుకోరా?
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని బోడికొండపై 400 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి సంవత్సరం పూర్తవుతున్నా, ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవటం హిందువులను అవమానించటమే అని తెలుగుదేశం నేత కిమిడి కళావెంకట్రావ్ అన్నారు. మర్దర్ జరిగినా 24 గంటల్లో పట్టుకునే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో, కోట్లాదిమంది భక్తులు నిత్యం పూజించే శ్రీరాముడి విగ్రహం ద్వంసం చేస్తే నిందితులను ఇంతవరకు పట్టులేకపోవటం వైసీపీ ప్రభుత్వ చేతకానితనం అన్నారు. జగన్ రెడ్డి హిందూమతం పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి ఇది నిదర్శనం అని ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు, విగ్రహ ద్వంసం ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు 230 పైగా దేవాలయాలపై దాడులు జరిగినా ఇంతవరకు ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకోలేదంటే అర్ధం ఏంటి? అని ప్రశ్నించారు.
మొదటి సారి దేవాలయంపై దాడి జరిగినపుడే నిందితులపై చర్యలు తీసుకుంటే మిగతా దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగేవా? అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ ఏమైంది? ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దేవాలయాలను అభివృద్ది చేయకపోగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా చోద్యం చూడటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దేవాలయాల ఆస్తులు, భూములు మీద ఉన్న శ్రద్ద దేవాలయాల భద్రత, అభివృద్దిపై లేకపోవటం సిగ్గుచేటు. జగన్ రెడ్డి తన స్వార్దం కోసం మతాల మద్య విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటమే తప్ప మత సామరస్యాన్ని ఎలా కాపాడాలో జగన్ రెడ్డికి తెలియదు. రామతీర్ధం ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కిమిడి కళా వెంకట్రావు డిమాండు చేశారు.