బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రామతీర్థంలో ఏపీ మంత్రులకు నిరసన సెగ : మేం డౌన్ అయిపోతామా? ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. రామతీర్థం ఘటన ఉద్రిక్తతలు చల్లారక ముందే విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో రామతీర్థం క్షేత్ర పర్యటనకు ఏపీ మంత్రులు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్లారు. వారికి నిరసనల సెగ తగిలింది. 
 
హిందూ ధార్మిక సంఘాలకు చెందిన కార్యకర్తలు అడుగడుగునా వెల్లంపల్లి, బొత్సలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర నిరసలన మధ్యే వారు ఆలయంలో ధ్వంసానికి గురైన విగ్రహాన్ని పరిశీలించారు. 
 
ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఎవరో కొందరు డౌన్‌డౌన్ అన్నంత మాత్రాన మేం డౌన్ అయిపోతామా? ఏంటి అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు బీజేపీ అంటే సదభిప్రాయం ఉండేదని, ఇప్పుడది పోయిందన్నారు. మేం వస్తుంటే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు... కొందరు అసభ్యకరంగా కూడా మాట్లాడారు అని బొత్స వెల్లడించారు. 
 
రామతీర్థం ఘటనపై తాము ఎంతో బాధపడుతున్నామని తెలిపారు. రాముడి విగ్రహాన్ని ఇలా చేయించినవాడు అసలు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసింది ఎవరైనా సరే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.  
 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం రామతీర్థం రావడంపై స్పందిస్తూ, చంద్రబాబు వస్తే ఏంటి, పోతే ఏంటి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఆలయాల విధ్వంసం జరిగితే అప్పుడెందుకు మాట్లాడలేదని బొత్స ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా బొత్స ఓ మీడియా ప్రతినిధిపై మండిపడ్డారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులందరినీ అప్రమత్తం చేశానని వెల్లడించారు. కానీ మాజీ శాసనసభ్యులు ఎవ్వరూ ఈ ఘటనపై స్పందించలేదని, గత ఐదురోజులుగా వారు ఎక్కడికెళ్లారని మీడియా ఎందుకు నిలదీయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.