బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (18:19 IST)

గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా చర్యలు: సిఎస్

కరోనా వైరస్ నియంత్రణకు మే 3 వరకూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. సిఎస్ మాట్లాడుతూ.. మే 3 వరకూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడం తోపాటు గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా ఈనెల 20వ తేది నుండి కొన్ని మినహాయింపులతో గ్రీన్ జోన్ లలో కార్యకలాపాలు జరిగేలా అనుమతించడం జరుగుతుందని అందుకు అనుగుణంగా నాలుగైదు రోజుల్లో మండలస్థాయిలో తహసిల్దార్, ఎంపిడిఓలు కూర్చుని సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని
సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.

ఈమండల స్థాయి ప్రణాళికలను ఆర్డీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు, ఆహారశుద్ధి పరిశ్రమలకు ఈనెల 20 నుండి తగిన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన సేవలన్నీ పూర్తిగా అందుబాటులో ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు. 

మే 3 వరకూ విధించిన లాక్ డౌన్ కాలంలో ఎటువంటి ప్రజారవాణా వ్యవస్థకు అనుమతి లేదని అంతేగాక అంతర్ జిల్లా,రాష్ట్ర కార్మికులు మూమెంట్ కు అనుమతి లేదని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు. అదే విధంగా విద్యా సంస్థలు, కోచిచింగ్ కేంద్రాలు,సినిమా ధియేటర్లు, సాంస్కృతిక, క్రీడా కేంద్రాలు, మతపరమైన సంస్థలు వంటివన్నీ మూసివేయాలని చెప్పారు.

అన్ని పబ్లిక్ స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా ముఖాన్ని కవర్ చేసేలా మాస్క్ లు వంటివి ధరించేలా చూడాలని చెప్పారు. అంతేగాక పబ్లిక్ స్థలాల్లో 5గురికి మించి గుమికూడ కుండా చూడాలని కలెక్టర్లు ఎస్పీలుకు సిఎస్ స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని అన్నారు. పబ్లిక్ స్థలాల్లో ఎవ్వరూ ఉమ్మి వేయకుండా చూడాలని చెప్పారు.

ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ ప్రస్తుతం లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఎవరికీ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

కరోనా వైరస్ కు సంబంధించి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కేసులు నమోదు అయ్యాయని గ్రామీణ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసర మూమెంట్ ను పూర్తిగా నివారించడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలా వరకూ నివారించవచ్చని ఆదిశగా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.

ఎస్పిలు జిల్లా కలెక్టర్లు,ఇతర సంబంధిత అధికారులతో పూర్తి సమన్వయంతో ఉండాలని డిజిపి ఆదేశించారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వద్దని స్పష్టం చేశారు.రెడ్ జోన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిజిపి గౌతం సవాంగ్ ఎస్పిలను ఆదేశించారు.