బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (05:18 IST)

కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటో?

టీఆరెస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత రాజకీయ భవిష్యత్తు పై అధికార పార్టీ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆమెను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కవితను ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు పంపాలని అధిష్టానం భావిస్తోందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

టీవీల్లో, వార్తాపత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కవితను ఢిల్లీకి పంపి.. అక్కడ వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనులు అప్పగించాలని కేసీఆర్, కేటీఆర్ భావించారని కూడా వార్తలు వినిపించాయ్. అయితే.. తాజాగా అభ్యర్థులు ఫైనల్ సమయంలో మాత్రం కవిత పేరు అస్సలే వినిపించలేదు.

దీంతో కవితను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారా..? లేకుంటే మరేదైనా కీలక పదవి ఇస్తారా..? అనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్‌లో రాజ్యసభ సభ్యుల ఎంపిక ఉత్కంఠకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కే.కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైపోయాయి. బుధవారం టీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం.

అయితే రాజ్యసభ సీటు ఆశించిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లను ఎమ్మెల్సీలను చేసి శాసనమండలికి పంపాలని కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆ ఇద్దరు పెద్దలు 13న నామినేషన్లు వేయనున్నారు.