శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:32 IST)

గూడ్స్‌ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌

రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి.

దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి. 
 
దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్‌లు చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. దీంతో ఆశించినంతగా బుకింగ్‌లు జరగటం లేదని తెలుస్తోంది. 
 
డీజీపీ ఆదేశాలు:
పాస్‌ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు.
 
ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.