1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:39 IST)

పరిమళించిన మానవత్వం.. ఆయానే అమ్మగా మారి..!

కంటికి కనిపించని కర్కశ  కరోనా ఒక వైపు మనుషుల ఆరోగ్యాన్ని మసి చేస్తూనే.. మరో వైపు మనుషుల్లో మానవత్వాన్ని, తోటివారికి సాయం చేసే గుణాన్ని పెంచింది.

ఇందుకు ఉదాహరణ.. కర్నూలు జిల్లాలో ఒక అంగన్వాడీ ఆయానే అమ్మగా మారి లాక్ డౌన్ లో భయపడుతున్న ఒక నిండు గర్భిణీకి ధైర్యం చెప్పి తనే స్వయంగా గర్భిణీని ఆటోలో  ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ..రెండు రోజులుగా దగ్గర ఉండి.. కాన్పు చేయించింది.
 
కర్నూలు నగరంతో పాటు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నంద్యాలలో ఒక వైపు కరోనా కేసులు..నంద్యాల షరాఫ్‌ బజార్‌లో నివసించే దివ్యభారతికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో భర్త కర్నూలులో ఉన్న ఆమె తల్లికి సమాచారమిచ్చాడు.
 
 
లాక్‌డౌన్‌ కారణంగా ఆమె నంద్యాలకు రాలేకపోయింది. ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ ఆయా చెన్నమ్మకు చెప్పి సాయం కోరడంతో ఆమె తెలిసిన వారి ఆటోలో దివ్యభారతిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. తనే దగ్గరుండి సాయం చేసింది. దివ్యభారతి శనివారం పండంటి బాబుకు జన్మనిచ్చింది.

నంద్యాలలోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ చెన్నమ్మ ఆదివారం వరకూ ఆస్పత్రిలోనే ఉండి దివ్యభారతికి సాయం చేసిన విషయం ఐసీడీఎస్‌ పీడీ భాగ్యరేఖ ద్వారా కలెక్టర్‌ వీరపాండియన్‌కు తెలిసింది. దీంతో ఆయన  చెన్నమ్మను అభినందించి.. రూ.20 వేల నగదు బహుమతి ప్రకటించారు.
 
ఏటా కుటుంబంతో కలిసి ఈస్టర్‌ పండుగ ఘనంగా జరుపుకుంటామని, అయితే సాటి మహిళ ఇబ్బందుల్లో ఉండటంతో పండుగను పక్కన పెట్టి సాయం చేశానని ఆయా చెన్నమ్మ తెలిపింది. కరోనా పేరు వింటేనే భయపడుతున్న ఈ సమయంలో మూడు రోజులు తనవద్ద ఉండి అమ్మలా సేవ చేసిన చెన్నమ్మను ఎన్నటికీ మరచిపోలేనని దివ్యభారతి పేర్కొంది.  

నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నే ఉండి తన భార్యను అమ్మలా చూసుకుంటూ ఉన్న ఆయమ్మ చెన్నమ్మ ను బంగారు పని చేసుకునే రోజూ కూలీ దివ్యభారతి భర్త హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.