అనుమానం పెనుభూతమై... నడిరోడ్డుపై భార్యను నరికేశాడు...
అనుమానం పెనుభూతమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపై ఆమెను అత్యంత కిరాతకంగా నరికేశాడు. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
విశాఖ పూర్ణా మార్కెట్ సమీపంలో పండా వీధికి చెందిన వడిసెల మోహనరావు(36), అదే ప్రాంతానికి చెందిన నాగమణి(30) ప్రేమించుకుని 2004లో పెళ్లిచేసుకున్నారు. వీరికి దుర్గారావు(13), హన్సిక(11) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహనరావు ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పని చేస్తుండగా, నాగమణి నాలుగేళ్లుగా సిరిపురంలో ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది.
అయితే, నాగమణి ప్రవర్తనపై మోహనరావుకు అనుమానం ఏర్పడింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం బలపడింది. దీంతో వారిద్దరూ తరచూ గొడవ పడుతూ వచ్చారు. ఒకటికి రెండుసార్లు పంచాయతీ పెద్దల వద్దకు కూడా సమస్య వెళ్లింది. అయినా పరిస్థితి మారకపోవడంతో రెండు రోజుల క్రితం మోహనరావు టవల్‌ను ఆమె మెడకు బిగించి హత్యచేయబోయాడు.
ఆ సమయానికి బంధువు ఒకరు అక్కడకు రావడతో ఆమె బయటపడింది. ఆ రోజు నాగమణి సమీపంలోనే ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రెస్టారెంట్‌కు వచ్చివెళ్లేది. ఈ క్రమంలో శనివారం రాత్రి కూరగాయలు తరిగే కత్తి తీసుకుని, నాగమణి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో పని ముగించుకుని తనతోపాటు పనిచేస్తున్న మరో ముగ్గురు మహిళలతో కలసి ఆటో ఎక్కింది. మోహనరావు కూడా అదే ఆటో ఎక్కాడు. తనతోపాటు ఇంటికి రావాలని నాగమణిని కోరగా, ఆమె నిరాకరించింది.
పండావీధి సమీపంలో నవరంగ్ థియేటర్ వద్ద అందరూ ఆటో దిగారు. ఇంటికి తిరిగి వచ్చేయాలని నాగమణిని మరోసారి కోరాడు. ఇప్పుడు రానని, ఉదయం వస్తానని సమాధానం ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య స్వల్పవాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేక మోహనరావు తన వెంట తెచ్చుకున్న కత్తితో నాగమణి పొట్ట, ఛాతి, భుజాలపైన విచక్షణారహితంగా పొడిచాడు.
దీంతో నాగమణితో పాటుపనిచేస్తున్న మహిళలు, రోడ్డుపై ఉన్న ఇతరులు గట్టిగా కేకలు వేయడంతో మోహనరావు అక్కడ నుంచి పరారైపోయాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ఉమాకాంత్ సిబ్బందితో ఘటనా స్దలానికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న నాగమణి కేజిహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.