1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)
నెల మొదటి తారీఖునే జీతం రాకపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా వుంటాయో, నెలాఖరులో ఇంట్లో డబ్బులు లేక కటకటలాడుతుంటే పరిస్థితి ఎలా వుంటుందో ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా తనకు తెలుసునని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ... ప్రభుత్వం నడిపించేవారు బాధ్యత గల నాయకులైతే ప్రజలకు కష్టాలు వుండవనీ, ఐతే గత ప్రభుత్వంలో ఇది జరగలేదని అన్నారు.
ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా వుందో తెలుసుకుంటున్నామనీ, కొద్దిరోజుల్లో 7 శ్వేత పత్రాలు ప్రజల ముందు పెడతామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పరిస్థితి తెలియాల్సి వుందన్నారు. ఇప్పటికిప్పుడు చూస్తే రాష్ట్రానికి వేలకోట్లు రుణాలు తెచ్చారనీ, ఆ డబ్బంతా ఏం చేసారన్నది పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తను కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు.