బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:06 IST)

15న విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఈ నెల 15న రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె సంబంధిత శాఖల అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా కరోనా నేపధ్యంలో దాని నివారణకు వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను ఈ వేడుకల ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహనను పెంపొందించేందుకు స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన పధకాలపై ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలని సిఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

దీనిపై సాధారణ పరిపాలన,వైద్య ఆరోగ్యం,సమాచార శాఖ, కృష్ణా జిల్లా కలెక్టర్,పో లీస్ కమీషనర్లు చర్చించుకుని ఒక ప్రణాళికతో వస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదంతో వేడుకలను ఘనంగా  నిర్వ‌హించేలా చర్యలు తీసుకుందామని సిఎస్ నీలం సాహ్నిచెప్పారు. 

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతించి ఘణంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వీడియో సమావేశంలో ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)ప్రవీణ ప్రకాశ్ మాట్లాడుతూ పరిమిత సంఖ్యలో అతిధులను ఈవేడుకలకు ఆహ్వానించేందుకు వీలుగా జాబితాను సిద్ధం చేసి ఆహ్వాన పత్రాలను ప్రచురించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర రవాణా,రోడ్లు భవనాలు, శాఖ ముఖ్య కార్యదర్శి యంటి కృష్ణ బాబు మట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయడం జరుగుతుందని వివరించారు. 

రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 14 శకటాలను,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 13 శకటాలను ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్‌కు వివరించారు. కోవిడ్ నేపధ్యంలో ఈసారి 10 శకటాలకు మించకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.

ముఖ్యంగా కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు, సంజీవని బస్సులు, మెడల్ టెస్టింగ్ ల్యాబ్లు,కరోనాపై విలేజ్ వాలంటీర్లు,ఎఎన్ఎంలు ఇంటింటా సర్వే,లాక్ డౌన్, అన్ లాక్‌డౌన్ నిబంధనల అమలుపై పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ణానంతో ట్రేసింగ్ చేసిన విధానం,కోవిడ్  ఆసుపత్రుల ద్వారా సేవలు, టెలీమెడిషిన్, నాడు నేడులో చేపట్టిన ఆసుపత్రుల అభివృద్ధి,104, 108 అంబులెన్సులు కోవిడ్ వారియర్స్,కోవిడ్ అవగాహన కార్యక్రమాలు,వైయస్సార్ చేయూత,ఆసరా,రైతు భరోసా కేంద్రాలు,కోవిడ్ సమయంలో ఫించన్ల పంపిణీ,ఎంఎస్ఎంఇ రంగానికి చేయూత,నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి,విద్యాకానుక వంటి అంశాలపై శకటాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.

అలాగే వేడుకలకు పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుతో పాటు పరిమిత సంఖ్యలో మీడియాను అనుమతించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని సిఎస్ కు వివరించారు. 

కృష్ణా జిల్లా కలక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ఈవేడుకలకు 50 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరో 300 మంది ఇతరఆహ్వానితులు తదితరులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయడం జరగుతుందని చెప్పారు.విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో ఉంచుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణకు అనుకూలంగా ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంను అన్ని విధాలుగా సన్నద్దం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఎంజి రోడ్డును పూర్తిగా సుందరీకరించడం జరుగుతుందని చెప్పారు.అంతేగాక పెద్దఎత్తున పారిశుధ్య నిర్వహణ పనులు చేపడతామని స్టేడియంలోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ ధర్మల్ స్క్రీనింగ్ అనంతరం లోనికి అనుమతిస్తామన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్, విజయవాడ పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు, సిపిడిసిఎల్ సిఎండి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.