ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 30 జూన్ 2021 (15:36 IST)

శ్రీనివాసా కనికరించవా? దర్సనాల పెంపు ఇప్పట్లో లేనట్లేనా? మరెప్పుడు?

శ్రీవారి ఆలయంలో దర్సనాలు పెంపు ఇప్పట్లో లేనట్లేనా? కొండపై పరిస్థితి చూస్తుంటే మాత్రం అలానే అనిపిస్తోంది. ఓవైపు స్వామివారి దర్సనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటే మరోవైపు చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సడలింపులు లేవు. దీంతో దర్సనాల పెంపుపై టిటిడి పునరాలోచనలో పడింది.
 
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని భక్తులు తపిస్తుంటారు. నిత్యం వేలసంఖ్యలో తరలివస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 60 నుంచి 80 వేలమంది ఉంటుంది. సెలవు రోజుల్లో లక్ష మంది దాకా వస్తుంటారు. కోవిడ్ దెబ్బతో తిరుమలలో చాలా మార్పులు చోటుచేసుకున్నారు. 
 
గత యేడాది 80 రోజుల పాటు శ్రీవారి దర్సనాలను నిలిపివేశారు. ఆ తరువాత పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్సనానికి అనుమతిస్తోంది టిటిడి. మొదట్లో 6 వేల మందితో దర్సనాలు ప్రారంభించగా ఆ సంఖ్య 60 వేలకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరోసారి దర్సనాలను కుదించింది టిటిడి.
 
ఏఫ్రిల్ 14వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సర్వదర్సనం టోకెన్లను భక్తులకు నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లను 25 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. ఫలితంగా మే, జూన్ మొదట్లో శ్రీవారిని దర్సించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
 
ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. టిటిడి 5 వేల టోకెన్లు జారీ చేస్తున్నా స్వామివారిని దర్సించుకునే భక్తుల సంఖ్య 18 వేల వరకు చేరుకుంది. వర్చువల్ సేవా టిక్కెట్లు, విఐపి సేవా టిక్కెట్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్సించుకుంటున్నారు.
 
కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే దర్సనాల పెంపు ఉంటుందని పాలకమండలి చివరి సమావేశంలో ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం టిటిడి ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చిత్తూరు జిల్లా మొదటి, రెండు స్థానంలో ఉంటోంది.
 
దీంతో చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సడలింపులు ఇవ్వలేదు. ఫలితంగా దర్సన టోకెన్ల పెంపుపై టిటిడి పునరాలోచనలో పడింది. టిటిడి ఈఓ జవహర్ రెడ్డి రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ ఛైర్మన్ గా కొనసాగుతూ ఉండడంతో పరిస్థితులను పూర్తిస్థాయిలో అంచనా వేసిన తరువాత దర్సనాల టిక్కెట్లను పెంచే అవకాశం ఉంది.