మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (16:13 IST)

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి ఐ.ఎస్.ఓ. గుర్తింపు

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేటలోని కోట‌ప్ప‌కొండకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు ల‌భించింది. గుర్తింపు పత్రాన్ని త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధర్మకర్త కొండలరావు జమిందార్, కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి, వేదపండితులకు ఐఎస్.ఓ. సంస్థ అధికారులు అందించారు. 
 
కోటప్పకొండ కొండ‌లో  త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో భ‌క్తుల‌కు అందించే సేవలు బాగున్నాయ‌ని గుర్తించారు. ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నభక్తులకు ఈ సేవ‌లు అందుతున్నాయని. నాణ్యతతో కూడిన సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చిన‌ట్లు  ఐఎస్.ఓ. సంస్థ అధికారులు తెలిపారు.
 
కోటప్పకొండకు ISO 9001:2015 అంతర్జాతీయ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉంద‌ని, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ దేవస్థానంలో నాణ్యమైన సేవలందించేందుకు సహకరిస్తున్న కార్యనిర్వహకులకు, పాలకమండలికి,  వేద పండితుల‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోటప్పకొండను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దటమే త‌న ఆకాంక్ష అని  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

రాబోయే 2022 వ సంవత్సరంలో కోటప్పకొండలో భక్తులకు అందిస్తున్న ప్రసాదాలు లడ్డు, అరిసెల నాణ్యతపై కూడా అంతర్జాతీయ గుర్తింపునిస్తామ‌ని. ఇక్కడ ప్ర‌సాదాల తయారీ, భ‌క్తులకు అందించే పద్దతి చాలా బాగుంద‌ని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి హైమ్ తెలిపారు.