ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ హోమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ హోం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ హోమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, కార్యాలయ ప్రాంగణంలో భనన నిర్మాణం కోసం పవన్ భూమి పూజ నిర్వహించారు.
సోమవారం సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజలో పట్టు వస్త్రాలను ధరించిన పవన్ కళ్యాణ్... యాగశాలకు వచ్చి దీక్షలో కూర్చొన్నారు. ఇందుకు సంబంధించిన జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ యాగం కూడా మంగళవారం కూడా కొనసాగనుంది.
ఈ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేసి దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను అభిముఖంగా యంత్రస్థాపన చేశారు. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూల హారాలు, అరటిజెట్లు, రంగవల్లులతో యాగశాలను ఆకర్షణీయంగా అలంకరించారు. కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.