శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (08:38 IST)

రుషికొండకు బోడిగుండు కొట్టేశారు.. 21 ఎకరాల్లో తవ్వకాలు : జనసేన కార్పొరేటర్ మూర్తి

rishikonda destroy
విశాఖపట్ణంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న రిషికొండకు వైకాపా నేతలు బోడిగుండు కొట్టేశారని జనసేన ఆరోపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎస్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. 
 
వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుషికొండ వద్ద భూములను ఒక వర్గానికి కేటాయించగా, వైకాపా హయాంలో వాటి వినియోగాన్ని మార్చేశారని ఆరోపించారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడానికి వైకాపా ప్రభుత్వం అనుమతులు తీసుకుని 21 ఎకరాల మేర కొండను తవ్వేసి నిర్మాణాలు చేపట్టిందని ఛాయాచిత్రాలతో హైకోర్టుకు నివేదించామన్నారు. 
 
తీర ప్రాంతానికి 200 మీటర్ల తర్వాతే నిర్మాణాలు ఉండాలని, తీర ప్రాంత నియంత్రణ పరిధి నిబంధనల మేరకు 9 మీటర్ల ఎత్తు వరకే కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి యంత్రాలు వినియోగించకూడదన్నారు. రుషికొండలో ఆయా నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం రుషికొండ నిర్మాణాలపై రోజుకో ప్రకటన చేస్తోందన్నారు.