ఆ విషయంలో శ్రీ జగన్ రెడ్డిగారికి జనసేన మద్దతు: పవన్ కళ్యాణ్
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం అంటే సమస్య పరిష్కారం అయినట్లు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే.
భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడదని జనసేన కోరుకుంటోందన్నారు. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలి.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయాయి. వీటి గురించీ సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ విచారణ చేయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై శ్రీ రమణ దీక్షితులు గారు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. తిరుమల శ్రీవారికి, శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ దర్యాప్తు చేయాలి.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే, మన సనాతన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలి. అందులో భాగంగా దానివైపు వేసే తొలి అడుగే “మహిళల జ్యోతి ప్రజ్వలన” కార్యక్రమం. ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన ఈ కార్యక్రమం నేటి సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య యధావిధిగా కొనసాగుతుంది.
11 సెప్టెంబర్ అంటే స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం- మతసామరస్యాన్ని కాపాడుకుందాం’ అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం. అంతా దైవ సంకల్పం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల జేశారు