పోలీస్ స్టేషన్లు కావవి జగనన్న స్టేషన్లు
ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ చట్టాన్నివైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమన్నారు.
విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు,, గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం తగదన్నారు. కొండపల్లి లో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసిపి వర్గీయులు దాడి చేయటం దుర్మార్గమని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్లు జగనన్న స్టేషన్లుగా మారాయని ఆయన విమర్శించారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు తాము నిరసిస్తూనే ఉన్నామని, అయినా పాలకుల్లో చలనం లేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆస్తి పన్నుపై కుటిల నాటకం ఆడుతున్నాయని, విలువ ఆధారితంగా ఆస్తి పన్ను ప్రవేశపెట్టాయని విమర్శించారు. ఇలా పన్ను కడుతూ పోతే, సొంత ఇంటి దారు కొంత కాలానికి రుణ గ్రస్తులు అయిపోతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఆస్తి పన్ను పెంపును వెంటనే విరమించాలని రాష్ట్ర ప్రబుత్వాన్ని ఆయన డిమాండు చేశారు.