వంగవీటి రాధా: బ్యాక్ టు పెవిలియన్‌కు సిద్ధమా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ ఇచ్చేందుకు వంగవీటి రాధా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదనే ఆవేదనతో వంగవీటి ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో చాలామంది యువ నేతలు ఇపుడు డైలమాలో పడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు.. చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయారు. అయితే..పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీని వీడి చాలా మంది యువ నేతలు.. టీడీపీ బాటపట్టారు. అయితే.. పార్టీ అనుకున్న విధంగా అధికారంలోకి రాలేదు.
ఇక, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవారిని పట్టించుకునే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో యువ నాయకులు గడిచిన రెండేళ్లుగా పార్టీలో వెయిట్ చేసినా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉందామా? పోదామా? అనే డైలమాలో పడ్డారు.
విజయవాడలో సినియర్ నాయకుడు వంగవీటి రాధా, 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో తాను కోరుకున్న టికెట్ ఇవ్వలేదని.. టీడీపీలోకి జంప్ చేశారు. అయితే.. ఇక్కడా ఛాన్స్ లేకపోయినా.. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ, తల్లి రత్నకుమారితో కలిసి టీడీపీ తరఫున ప్రచార యుద్ధం చేశారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం పర్యటించి, జగన్ సీఎం కాకుండా అడ్డుకుంటానని ప్రకటించారు.
అయితే అప్పట్లో ఏ టీడీపీ అయితే రాధా తండ్రి రంగాను హత్య చేయించిందో అదే టీడీపీ చెంత ఆయన చేరతారా? అన్న విమర్శలు కూడా వైసీపీ నుంచి వచ్చాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఎన్నికల సమయంలో కొద్దికాలమే అయినప్పటికీ.. టీడీపీకి దన్నుగా ఉన్న రాధా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టడం లేదని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మందికి పార్టీ పదవులు ఇచ్చినా, రాధాను మాత్రం ఆయన పట్టించుకోలేదు.
టీడీపీ మద్దతు ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి ఏడాది కిందటి వరకు రాధా హాజరయ్యారు. రాజధాని ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. పలుమార్లు వెళ్లి రైతులకు భరోసా ఇచ్చారు. ఇవన్నీ గమనించినా బాబు ఎందుకో రాధాను పక్కన పెడుతున్నారని ఆయన సన్నిహితుల ఆరోపణ. ఇక ఇప్పట్లో ఆయనను పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పైగా బెజవాడలో రాధా కోరుకునే విజయవాడ సెంట్రల్ సీటు నుంచి టీడీపీ సీనియర్ నేత బొండా ఉమాను తప్పించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉందామా? పోదామా? అనే చర్చ వంగవీటి గూటిలో ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.