సీఎం జగన్ సిబిఐ కేసు వాదనలకు సిద్ధం!
అక్రమాస్తులపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో వాదనలకు సిద్ధం కావాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు సహ నిందితుల తరపు న్యాయవాదులకు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీల్యాండరింగ్ కేసుల విచారణ ఆగస్టు 6కి వాయిదా పడింది.
సీబీఐ కేసులతో నిమిత్తం లేకుండా ఈడీ కేసులు ప్రత్యేకంగా విచారిస్తామన్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జగతి పబ్లికేషన్స్ తరపున మెమో దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు జడ్జి బి.ఆర్.మధుసూదనరావు విచారణను వాయిదా వేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై కేసుల విచారణ ఆగస్టు 6కి వాయిదా పడింది.
సీబిఐ సీఎం జగన్ ఆస్తుల కేసును నానుస్తోందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. తరచూ వాయిదాలు పడుతూ, సిబిఐ ఈ కేసు విచారణకు ముందుకు సాగడం లేదనే వాదనలు వినిస్తున్నాయి. అయితే, ఇపుడు ఆ కేసు వాదనలు మొదలు కాబోతున్నాయని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్టు నుంచి వాదనలు ప్రారంభం అయితే, కేసు త్వరితగతిన ఒక కొలిక్కి వస్తుందని పేర్కొంటున్నారు.