శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (15:35 IST)

అసెంబ్లీని అనంతపురంలో పెట్టాలి : వైకాపా ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్టుకు జైకొట్టిన వైకాపాకు చెందిన కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి.. మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, రాజధాని మార్పు అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాజధాని మార్పుపై హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం అన్నారు. గత పొరపాట్లు పునరావృతంకాకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బటయకు వస్తాయని మంత్రి మోపిదేవి చెప్పారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు వెళ్లాయన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని మంత్రి మోపిదేవి చెప్పుకొచ్చారు.