కాకా హోటల్ లో భోం చేసి, పైసలిచ్చి పోయిన కేరళ సీఎం
కేరళ సీఎం పినరయి విజయన్ సింప్లిసిటీకి నిదర్శనమిది. ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదీ కేరళ లాంటి అత్యధిక విద్యావంతున్న రాష్ట్రానికి. అయినా ఆయనకు ఎలాంటి గర్వం లేదు... అహంభావం అసలే లేదు. చక్కగా జనాల మధ్యకు వచ్చి, తన సొంత డబ్బులతో భోజనం చేసి, వెళ్ళిపోయిన ఆ ముఖ్యమంత్రిని చూసి, అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు.
ఏ రాష్ట్రంలో అయినా, ముఖ్యమంత్రి పర్యటనకి వస్తున్నారు అంటే, ఎంత హంగామా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆయన వచ్చి, వెళ్లే మార్గంలో ఉన్న వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసి వేయిస్తారు పోలీసులు. వచ్చే ముందు వెనుక, అందరూ ఎక్కడి వారు ఆగిపోవాల్సిందే, ఆయన వెళ్లాకే అందరికీ విముక్తి. ఇలా ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గంటల కొద్ది ట్రాఫిక్ స్థంబింప చేసి, ప్రజలకు పట్ట పగలే నక్షత్రాలు చూపిస్తారు మన పోలీసులు.
కానీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూటే సెపరేటు. ఆయన ఎలాంటి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా, ఒక ఆటోలో వచ్చి, ఇలా ఒక కాకా హోటల్లో చక్కగా తృప్తిగా భోజనం చేసి వెళ్లిపోయారట. అంతే కాదు, తాను సీఎంని అనే మాట కూడా ఎత్తకుండా, చక్కగా కాకా హోటల్ ఓనర్ కి భోజనానికి తన స్వంత డబ్బులు చెల్లించి మరీ వెళ్ళారట. ఇది వినడానికే చాలా విడ్డూరంగా అనిపిస్తోంది కదూ! పదవి ఇచ్చింది ప్రజల సేవ చేయటానికి అని నమ్మే నాయకులు క్రమంగా కనుమరుగవుతున్నారు. పదవిని హోదాగా భావించి, ప్రజా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టటం, ప్రోటోకాల్ మెయింటెన్ చేయడం ఫ్యాషన్ గా మారిన ఈ రోజుల్లో, ఒక సీఎం సామాన్య వ్యక్తిగా వ్యవహరించడం విడ్డూరమేగా. దటీజ్ కేరళ సీఎం పినరయి విజయన్.