శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (19:17 IST)

కేరళలో ఏపీ సీన్ రిపీట్.. సీఎంగా మామ.. మంత్రిగా అల్లుడు..

కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ను వరుసగా రెండోసారి విజయతీరాలకు చేర్చిన పినరయి విజయన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.
 
కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. సీఎం పినరయి విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
 
76 ఏళ్ల విజయన్ కేరళ ముఖ్యమంత్రిగా విజయన్ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. ఇక రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయన్.. కేబినెట్‌లో కీలక మార్పులు చేశారు. 
 
ఎల్డీఎఫ్లో భాగస్వామ్యపక్షాలైన జేడీఎస్, ఎన్సీపీకి చెందిన ఇద్దరు తప్ప.. మంత్రులంతా కొత్త వారే కావడం విశేషం. ముగ్గురు మహిళలు విజయన్ కేబినెట్‌లో చేరారు.
 
విజయన్‌ మేనల్లుడు పీఏ.మహమ్మద్ రియాజ్‌ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. కేరళ శాసనసభ చరిత్రలో మామ, అల్లుడు మంత్రివర్గంలో ఉండడం ఇదే తొలిసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి సీన్ కనిపించింది. ఏపీ సీఎంగా ఎన్టీ రామారావు వ్యవహరించగా.. ఆయన కేబినెట్‌లో చంద్రబాబు మంత్రిగా వ్యవహరించారు.