కేరళ ఆరోగ్య మంత్రి కానున్న మీడియా జర్నలిస్టు
కేరళ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఈ నెల20వ తేదీన కొలువుదీరనుంది. ఈ మంత్రవర్గంలో మంత్రిపదవులు దక్కించుకున్నవారంతా కొత్తవారే. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం పాతవారు. అయితే, ఈ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కేకే శైలజను నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, సీపీఎం అధినాయకత్వం మాత్రం ఆమెకు కూడా చోటు కల్పించలేదు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పార్టీ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలో కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు.. మే 20న కొలువుదీరే కొత్త కేబినెట్‌లో చోటులభించలేదు. మరి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శైలజ స్థానంలో మరో మహిళనే సీఎం పినరయి విజయన్ భర్తీ చేస్తున్నారు.
ఎమ్మెల్యే వీణ జార్జ్ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. పట్టణమిట్ట జిల్లాలోని ఆరన్‌మూల నియోజకవర్గం నుంచి వీణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లోనూ అదే స్థానం నుంచి ఆమె విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు వీణ జర్నలిస్టుగా పని చేసింది. ఇక సీఎం విజయన్ వద్ద హోం, ఐటీతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలను ఉంచుకోనున్నారు.