మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Modified: గురువారం, 19 నవంబరు 2020 (10:25 IST)

నాటు సారా మత్తులో గొడ్డలితో కొడుకుని నరికేశాడు.. అడ్డొచ్చిన భార్యపై కూడా...

వెస్ట్ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో ఓ దారుణం జరిగింది. నాటుసారా పూటుగా సేవించిన ఓ వ్యక్తి... చేతికందొచ్చిన కుమారుడిని గొడ్డలితో అడ్డంగా నరికేశాడు. ఈ హఠాత్పరిణామం చూసి అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నల్లజర్ల మండలం జగన్నాథపురానికి చెందిన పసగడి రాంబాబు అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులతో కలిసి వివాహాది శుభకార్యాలకు వంటలు చేస్తుంటాడు. సొంతిల్లు ఉంది. పెద్ద కుమారుడి కుటుంబం ఒక పోర్షన్‌లోను, భార్య కుమారి, అవివాహితుడైన చిన్న కుమారుడు అచ్చారావు(25)తో కలిసి తాను మరో పోర్షన్‌లోను ఉంటున్నారు. 
 
అయితే, కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాంబాబు నాటు సారా తాగొచ్చి భార్య, చిన్న కుమారుడితో ఘర్షణకు దిగాడు. గొడ్డలితో అచ్చారావును, అడ్డొచ్చిన భార్యనూ నరికేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 
 
పెద్ద కుమారుడు, స్థానికులు వారిని 108లో నల్లజర్ల ఆస్పత్రికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యలో అచ్చారావు మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసులు వెల్లడించారు.