బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (21:32 IST)

జీహెచ్ఎంసీ పోరు : భాగ్యనగరిలో ఉచిత వైఫై.. తెరాస మేనిఫెస్టో రిలీజ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. డిసెంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ఇటు అధికార తెరాస, అటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలతో పాటు.. చిన్నాచితక పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. 
 
అయితే, ఇతర పార్టీల కంటే అధికార తెరాస ఒక అడుగు ముందుగానేవుంది. ఈ ఎన్నికల కోసం ఆ పార్టీ తొలి జాబితాను బుధవారం ప్రకటించింది. అలాగే, మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్లో అతి ప్రధానమైనది... ఈ ఎన్నికల్లో తెరాస విజయభేరీ మోగిస్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొంది. 
 
అలాగే, నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం, అన్ని గ్రంథాలయాల ఆధునికీకరణ, రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు, రూ.1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్, మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక వంటి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించింది. 
 
మరోవైపు, టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. మొత్తం 105 అభ్యర్థులతో తొలి జాబితా విడుదలైంది. 
 
కాగా, ఈ ఎన్నికల్లో తెరాస 110 స్థానాల్లో గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తమ సర్వేల్లో ఇది తేలిందని తెలిపారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఏ డివిజన్‌లో బాధ్యతలను అప్పగించినా... పూర్తి బాధ్యత వహించి గట్టిగా పని చేయాలని అన్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
 
ఇకపోతే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైల్వే, ఎల్ఐసీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను కలుపుకుని వెళ్లాలని సూచించారు. 
 
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేస్తామని... మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పారు.