మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (17:24 IST)

నడిరోడ్డుపై పెద్దపులి.. చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు

తెలంగాణలో పెద్దపులి కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి అక్కడి వారి వెంటపడటం కలకలం రేపుతోంది. రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి.. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది.
 
పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీశారు. పులి నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరో ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు హడలిపోతున్నారు. ఇక ఈ నెల 11న ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల విఘ్నేష్‌పై పులి దాడి చేసి చంపేసింది.
 
ఆ పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. అయినా ఇప్పటివరకు పెద్దపులి జాడ దొరకలేదు. ఆ పులి మహారాష్ట్ర అడవుల వైపు వెళ్లిపోయి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే తాజాగా మరో పులి మనుషులపై దాడికి భయాందోళనలకు దారి తీస్తోంది.