గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (11:22 IST)

అన్న ప్రేమ కోసం... తనువు చాలించిన తమ్ముడు.. ఎక్కడ?

car accident
నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. అన్న ప్రేమ కోసం తమ్ముడు తనువు చాలించాడు. అన్న ప్రేమించిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువతి కూడా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా బిట్రగుంట వద్ద జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి గ్రామానికి చెందిన కాకార్ల నాదముని అలియాస్ నిరంజన్, రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన ఓ యువతిలకు ఒక యేడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని నిరంజన్‌కు యువతి సమాచారం చేరవేసింది. తాను రాలేనని, తన తమ్ముడైన కాకర్ల దేవేంద్ర(22)ను పంపిస్తున్నానని.. అతనితో వచ్చేయమని చెప్పారు. దీంతో దేవేంద్ర... హుకుంపేటకు వెళ్లి ఆ యువతిని తీసుకుని నంబర్ ప్లేట్ లేని స్కూటీలో స్వగ్రామానికి బయలుదేరాడు. 
 
మార్గమధ్యలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద జాతీయ రహదారి ఆకాశవంతెన సమీపంలో నిద్రమత్తులో ఉన్న దేవేంద్ర రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి 108కు సమాచారమిచ్చారు. వాహనంలో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. యువతి చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.