శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (10:18 IST)

నిబంధనల పేరుతో మొండికేసిన 108 సిబ్బంది.. బైకుపై మృతదేహం తరలింపు

deadbody
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ మాఫియా చేసిన పని ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ మాఫియా భారీ మొత్తంలో డిమాండ్ చేసింది. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని మృతుని తండ్రి పుట్టెడు దుఃఖంలోనే తన కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్రవాహనంపై 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. 
 
ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అయినప్పటికీ ఏపీలో అంబులెన్స్ డ్రైవర్ల పనితీరు ఏమాత్రం మారలేదు. తాజాగా నెల్లూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిబంధనలను సాకుగా చూపి 108 అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని భుజంపై వేసుకుని మోటారు బైకుపైనే ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని సంగంలో జరిగింది. 
 
సంగంకు చెందిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు చిన్నారులు బహిర్భూమికోసం వెళ్లి కనిగిరి రిజర్వాయర్‌ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈశ్వర్ మృతదేహాన్ని కాలువ వద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఆ బాలుడు కూడా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 వాహన సిబ్బందిని కోరగా, వారు నిరాకరించారు. మృతదేహాలను తరలించేందుకు నిబంధనలు సహకరించవని మొండికేశారు. ఎంతగా బతమిలాడుకున్నప్పటికీ వారు కనికరించకపోవడంతో బిడ్డ శవాన్ని భుజం వేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తరలించారు. ఈ దృశ్యం చూపరులను సైతం కన్నీరు పెట్టించింది.