గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (10:05 IST)

నెల్లూరు జిల్లా వైకాపాలో సంక్షోభం... మరో వికెట్ డౌన్...

chejarla subba reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు చెందిన నేతలు ఎన్నికల సమయం సమీపించే కొద్దీ పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. తాజాగా నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి కూడా టాటా చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈయన ఈ నెల రెండో తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. 
 
తాజాగా చేజర్ల సుబ్బారెడ్డి కూడా వైకాపా నుంచి తప్పుకున్నారు. తన ప్రయాణం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లోనే సాగుతుందని చెప్పారు. అంటే, ఈయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన చేజర్ల సుబ్బారెడ్డి ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జిల్లాలో వైకాపా విధేయుడిగా మంచి గుర్తింపు పొందారు. టీడీపీకి దగ్గరైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. మేకపాటి, వైకాపా అధిష్టానంపై విమర్శలు చేసినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి ధీటుగా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. అలాంటి నేత ఇపుడు వైకాపాను వీడటం వైకాపా శ్రేణులనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 
 
కాగా, వైకాపాకు మంచి పట్టున్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. నెల్లూరు ప్రాంతానికి చెందిన రెడ్లంతా గత ఎన్నికల్లో వైకాపాకు జై కొట్టారు. ఇపుడు అదే రెడ్లూ సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఒక్కొక్కరుగ వైదొలుగుతున్నారు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారు. ఇపుడు ఇదే జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి కూడా ఈ జాబితాలో చేరడంతో జిల్లాలో వైకాపా పట్టు దాదాపుగా పోయిందని వైకాపా శ్రేణులో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 
 
వారెవ్వా.... వాలంటీర్లకు బంపర్ ఆఫర్.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలనెలా జీతమంతా ఇచ్చేస్తారట.. 
 
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అధికార వైకాపా తరపున పోటీ చేయనున్న శివప్రసాద్ రెడ్డి.. ఆ నియోజకవర్గంలోని వాలంటీర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రాధేయపడ్డారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, తనకు నెలనెలా వచ్చే వేతనాన్ని వాలంటీర్లకే వెచ్చిస్తానంటూ తాయిలం ప్రకటించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు ఆమె కుమారుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్, శివ ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, "నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల నెల వచ్చే వేతనం అంతా వాలంటీర్లకే వెచ్చిస్తాను. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాలంటీర్లకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తాను. ఆ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఒక్కో వాలంటీర్ పరిధిలో 50 ఇళ్లు ఉన్నాయి. వాళ్లు వైకాపాకి ఓట్లు వేసేలా ప్రతి ఒక్క వాలంటీర్ కృషి చేయాలి" అని శివప్రసాద్ రెడ్డి ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ మాట్లాడుతూ, ఇపుడు మన రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కంటే వార్డు వాలంటీర్లకే గౌరవమర్యాదలతో పాటు విలువ ఉందని చెప్పడం గమనార్హం.