శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:51 IST)

ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిలో సరికొత్త ట్విస్ట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కమిషన్ ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, ఐపీఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టవచ్చా అనే సందేహం ఇపుడు ఉత్పన్నమైంది. ఈ అంశంపై ఇపుడు ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర డీజీపీగా గౌతం సవాంగ్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ సక్సెస్‌తో సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీని బదిలీ చేయడమేకాకుండా సాధారణ పరిపాలనా విభాగం (జీడీఏ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఏపీ సీఎం జగన్‌కు కుడిభుజంగా ఉన్న గౌతం సవాంగ్‌ను అవమానకరరీతిలో పంపించారనే ప్రచారం జరిగింది. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు గౌతం సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే, ఒక ఐపీఎస్ అధికారి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టవచ్చా అనే చర్చ ఇపుడు తెరపైకి వచ్చింది. ఒక వేళ ఈ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తే డీమ్డ్ టూ హేవ్ రిజైన్డ్ అంటూ మరో వాదన తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందుకే గౌతం సవాంగ్ నియామకంలో ఎలాటి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటుంది.